తిన్న వెంటనే టాయిలెట్‌కు వెళ్లాలనిపిస్తుందా? కారణం ఇదేనంటున్న వైద్యులు

  • దీనికి గాస్ట్రోకొలిక్‌ రిఫ్లెక్స్‌ ప్రధాన కారణం
  • కొత్తగా తిన్న ఆహారం వెంటనే బయటకు రాదు
  • కొన్ని జీర్ణవ్యవస్థ వ్యాధులు కూడా కారణం కావచ్చు
  • నొప్పి, రక్తం, విరేచనాలు ఉంటే వైద్యులను కలవాలి
  • ఆహారపు అలవాట్లు మార్చుకుంటే సమస్య తగ్గొచ్చు
  • లక్షణాలు కొనసాగితే పరీక్షలు అవసరం
భోజనం ముగిసిందో లేదో... కొన్ని నిమిషాలకే టాయిలెట్‌కు వెళ్లాలనిపించడం చాలా మందికి ఎదురయ్యే అనుభవం. ‘‘ఇప్పుడే తిన్న ఆహారం అంత త్వరగా బయటకు వచ్చేస్తుందా?’’ అనే సందేహం కూడా వెంటాడుతుంది. అయితే ఇది మీరు అనుకున్నట్లు కాదు. ఆహారం జీర్ణమయ్యే ప్రక్రియ చాలా నెమ్మదిగా సాగుతుంది. మరి తిన్న వెంటనే మలవిసర్జన చేయాలనిపించడానికి కారణమేంటి? ఇది సాధారణమేనా? ఎప్పుడు జాగ్రత్త పడాలి? అనే విషయాలను వైద్యులు వివరించారు.

జీర్ణ ప్రక్రియ
మనం తిన్న ఆహారం ముందుగా కడుపులోకి వెళ్లి జీర్ణరసాలతో కలుస్తుంది. ఆ తర్వాత చిన్నపేగులోకి చేరుతుంది. అక్కడి నుంచి పోషకాలను శరీరం గ్రహిస్తుంది. ఈ ప్రక్రియ పూర్తవ్వడానికి చాలా గంటలు పడుతుంది. చివరగా పెద్దపేగులోకి చేరిన తర్వాతే మలం తయారవుతుంది. కాబట్టి భోజనం చేసిన వెంటనే బయటకు వచ్చేది కొత్తగా తిన్న ఆహారం కాదు.

గాస్ట్రోకొలిక్‌ రిఫ్లెక్స్‌
భోజనం చేసిన వెంటనే మలవిసర్జన చేయాలనిపించడానికి ప్రధాన కారణం ‘‘గాస్ట్రోకొలిక్‌ రిఫ్లెక్స్‌’’. ఇది శరీరంలో సహజంగా జరిగే ప్రక్రియ. కడుపు ఆహారంతో నిండిన వెంటనే పెద్దపేగుకు సంకేతాలు వెళ్తాయి. దీంతో పెద్దపేగు కదలడం ప్రారంభించి అప్పటికే అక్కడ ఉన్న మలాన్ని పురీషనాళం వైపు నెడుతుంది. అందుకే టాయిలెట్‌కు వెళ్లాలనే కోరిక కలుగుతుంది. ఇది చాలామందిలో సహజంగానే కనిపించే శారీరక స్పందన.

ఎప్పుడు ఎక్కువ?
ఈ రిఫ్లెక్స్‌ అందరిలో ఒకేలా ఉండదు. కొందరిలో చాలా స్వల్పంగా ఉంటుంది. మరికొందరిలో మాత్రం బలంగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఎక్కువ పరిమాణంలో భోజనం చేసినప్పుడు.. కొవ్వు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకున్నప్పుడు, రాత్రంతా ఉపవాసం తర్వాత ఉదయం ఎక్కువ బ్రేక్‌ఫాస్ట్‌ చేసినప్పుడు ఇది ఎక్కువగా కనిపిస్తుంది. చిన్నపిల్లల్లో జీర్ణవ్యవస్థ చురుగ్గా ఉండటం వల్ల ఈ స్పందన మరింత స్పష్టంగా ఉండొచ్చని వైద్యులు చెబుతున్నారు.

వ్యాధుల సంకేతం
ప్రతి భోజనం తర్వాత తప్పనిసరిగా టాయిలెట్‌కు వెళ్లాల్సి వస్తే మాత్రం నిర్లక్ష్యం చేయొద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా తరచూ జరుగుతూ రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తే పరీక్షలు చేయించుకోవడం అవసరం. ఇరిటబుల్‌ బవెల్‌ సిండ్రోమ్‌, ఇన్‌ఫ్లమేటరీ బవెల్‌ డిసీజ్‌, లాక్టోస్‌ ఇన్‌టాలరెన్స్‌, సీలియాక్‌ వ్యాధి, జీర్ణాశయ ఇన్‌ఫెక్షన్లు, కొన్ని థైరాయిడ్‌ సమస్యలు దీనికి కారణం కావొచ్చు.

హెచ్చరిక లక్షణాలు
భోజనం చేసిన ప్రతిసారీ విరేచనాలు కావడం, తీవ్రమైన కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం, మలంలో రక్తం కనిపించడం, కారణం లేకుండా బరువు తగ్గడం, జ్వరం రావడం, రాత్రి నిద్రలో లేచి టాయిలెట్‌కు వెళ్లాల్సి రావడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ లక్షణాలు తీవ్రమైన జీర్ణవ్యవస్థ సమస్యలకు సంకేతం కావచ్చు.

ఏం చేయాలి?
ఈ సమస్య తరచూ ఉంటే కొన్ని జీవనశైలి మార్పులు ఉపయోగపడతాయని వైద్యులు చెబుతున్నారు. ఏ ఆహారం తిన్న తర్వాత సమస్య వస్తుందో గుర్తించేందుకు ఫుడ్‌ డైరీ నిర్వహించడం మంచిది. కొవ్వు, కారంగా ఉండే ఆహారం, ఎక్కువగా ప్రాసెస్‌ చేసిన పదార్థాలను తగ్గించాలి. పీచుపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. తగినంత నీరు తాగాలి. ఒకేసారి ఎక్కువగా తినకుండా కొద్దికొద్దిగా భోజనం చేయాలి. ఒత్తిడిని తగ్గించేందుకు వ్యాయామం, ధ్యానం, సరిపడా నిద్ర కూడా అవసరం.

వైద్యుల సూచన
భోజనం చేసిన వెంటనే మలవిసర్జన చేయాలనిపించడం చాలా సందర్భాల్లో పూర్తిగా సహజమే. దీనికి కారణం గాస్ట్రోకొలిక్‌ రిఫ్లెక్స్‌ మాత్రమే తప్ప కొత్తగా తిన్న ఆహారం వెంటనే బయటకు రావడం కాదు. అయితే ఈ సమస్య తరచూ రావడం, నొప్పి, విరేచనాలు, మలంలో రక్తం, బరువు తగ్గడం వంటి లక్షణాలు తోడైతే ఆలస్యం చేయకుండా గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ను సంప్రదించాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రారంభ దశలోనే పరీక్షలు చేయించుకోవడం వల్ల అసలు కారణాన్ని గుర్తించి సరైన చికిత్స తీసుకునే అవకాశం ఉంటుంది.

Gastrocolic Reflex
Digestive Health
Irritable Bowel Syndrome
Bowel Movement After Eating
Gastroenterology
Stomach Health Tips

More Telugu News